రైతు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం

 వర్షాల నేపథ్యంలో రైతు భరోసా పంపిణీ అనంతరం సభ నిర్వహిస్తాం

 డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల వెల్లడి

మన తెలంగాణ/ చింతకాని: ఖమ్మంలో నిర్వహించనున్న సిఎం ‘రైతు ఆశీర్వాద సభ’ వాయిదా పడింది. ఈ నెల 30న చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’ ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌లతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడాతూ వాతావరణ పరిస్థితులు, వర్షాల కారణంగా ఈ నెల 30న ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్‌రోడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హజరుకానున్న ‘రైతు ఆశీర్వాద సభ’ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

రైతులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో సభా ప్రాంగణం పూర్తిగా బురదమయంగా మారిందని, ప్రస్తుత పరిస్థితుల్లో లక్షలాది మంది రైతుల సమక్షంలో సభ నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు. రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం రైతుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని సభను వాయిదా వేస్తోందని పేర్కొన్నారు. తొలుత ప్రారంభోత్సవ సభగా నిర్వహించాలని భావించిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు రైతు భరోసా పంపిణీ పూర్తయిన అనంతరం మరింత వైభవంగా రైతు ఆశీర్వాద సభ పేరుతో ముగింపు వేడుకగా నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

వాతావరణ శాఖ నివేదికల ప్రకారం జిల్లాలో జూలై 3 లేదా 4వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరో వారం రోజుల వాతావరణ పరిస్థితులను సమీక్షించి, పరిస్థితులు అనుకూలిస్తే జూలై 6, 7 లేదా 8వ తేదీల్లో సభ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు స్థానిక మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా రైతులు, ప్రజలు ఈ సభపై విశేష ఆసక్తి చూపుతున్నారని, వాతావరణం అనుకూలించిన వెంటనే నిర్వహించే రైతు ఆశీర్వాద సభ ప్రజలు ఊహించని స్థాయిలో విజయవంతమవుతుందని డిప్యూటీ సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు.