
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు హింసాత్మకంగా మారుతుండటంపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. హింసలో పాల్గొన్న వారి పాస్‌పోర్టులు రద్దు చేసే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. అల్లర్లు, ఇతర హింసాత్మక ఘటనల్లో ప్రమేయమున్న వ్యక్తులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డింగ్‌లు, ఇతర సాంకేతిక సాక్ష్యాల ఆధారంగా హింసలో పాల్గొన్న వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైనట్టు చెబుతున్నారు. హింసలో చురుకుగా పాల్గొన్న వారిని గుర్తించి లీగల్ నిబంధనల ప్రకారం వారి పాస్‌పోర్టులు రద్దు చేయనున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యావ్యవస్థలో అవకతవకలకు నిరసగా కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగిస్తోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది సీజేపీ ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, సీసాలతో ఆందోళనకారులు దాడి చేయడంతో ఇద్దరు ఏసీపీలతో సహా ఆరుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘటనలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.











