హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయాలకు సంస్కృతి ఆచారాలకు ఆషాఢ మాస బోనాలు ఒక ప్రతిక అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం శ్రీ ఉజ్జయిని అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బంగారు బోనం పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పొన్నం మీడియాతో మాట్లాడారు. అమ్మవారిని ప్రభుత్వం పక్షాన వేడుకుంటున్నామని, తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎవరి వృత్తుల్లో వారు విజయం సాధించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి బోనాల ఉత్సవాల్లో ప్రజల ఆకాంక్షలకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇవ్వడంలో ముందుంటారని, బోనాల ఉత్సవాల్లో కులాలకతీతంగా మతలకతీతంగా భాగస్వామ్యమై జరుపుకుంటారని ప్రశంసించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని పొన్నం పేర్కొన్నారు.