
సిఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేశ్ కుమార్‌కు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సూచన
నేడు, రేపు ఢిల్లీలోనే సిఎం రేవంత్ మకాం
రేపు మరోసారి ‘సర్’ జాగ్రత్తలపై ఏఐసిసిలో మంతనాలు
హైడ్రాపై నేడు స్పందిస్తా: పిసిసి చీఫ్
మన తెలంగాణ/హైదరాబాద్: ఓట్ల సవరణ ప్రక్రియ (సర్)పై ఏ మాత్రం ఏమరపాటు, నిర్లక్షం ఉండకూడదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కెసి వేణుగోపాల్ పార్టీ రాష్ట్ర నాయకులకు సూచించారు. రాష్ట్రంలో ‘సర్’పై స్తబ్ధత ఉందని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ, ఏఐసిసి కార్యాలయం (ఇందిరా భవన్)లో కెసి వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తదితరులు సమావేశమై సుమారు రెండు గంటల పాటు పార్టీ వ్యవహారాలపై చర్చించారు. ఇదిలాఉండగా కీలకమైన ‘సర్’పై బుధవారం మరోసారి ఢిల్లీలో సమీక్ష చేద్దామని కెసి వేణుగోపాల్ వారితో అన్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పార్టీ సమన్వయ కమిటీ సభ్యులూ హాజరవుతారు. దీంతో ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ ఇరువురూ మంగళ, బుధవారాల్లో ఢిల్లీలోనే ఉండాల్సి వస్తున్నది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే..
సమావేశానంతరం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర వ్యవహారాలపై ఎఐసిసి సమీక్షించినట్లు చెప్పారు. బుధవారం ఉదయం పిసిసి సమన్వయ కమిటీ సభ్యులతో మరోసారి సమీక్ష చేస్తానని ఏఐసిసి పెద్దలు చెప్పారని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ సమన్వయ కమిటీ సభ్యులను కూడా ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించిందని ఆయన చెప్పారు. సంస్థాగత వ్యవహారాలతో పాటు ‘సర్’పై మరోసారి సమీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. తమతో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, ఏఐసిసి నాయకుడు వంశీచంద్ రెడ్డి కూడా హాజరవుతారని ఆయన వివరించారు. అర్హుల్లో ఏ ఒక్కరి ఓటు కోల్పోకూడదనేది పార్టీ ఉద్దేశం అన్నారు. కింది స్థాయిలో ఉన్న ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీల ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతున్నదని ఆయన ఆరోపించారు. కాబట్టి దీనిని అడ్డుకోవాల్సిన అవసరం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని ఆయన అన్నారు. ప్రతి ఓటును కాపాడాల్సిన బాధ్యత తమ పార్టీదేనని ఆయన తెలిపారు.
హైడ్రాపై నేడు స్పందిస్తా..
హైడ్రా చీఫ్ రంగనాథ్‌పై హైకోర్టు మండిపడడం, తొలగించాలని ఆదేశించడంపై విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించడంతో మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ మంగళవారం సమాధానం చెబుతానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియలో కొంత స్తబ్దత ఉందని ఆయన తెలిపారు. సంస్థాగత వ్యవహారాల్లో దేశంలోనే అగ్రభాగాన ఉన్న రెండు మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఉందన్నారు. బుధవారం జరిగే సమావేశంలో పార్టీ రాష్ట్ర నేతల మధ్య సమన్వయంపై కూడా చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాలపై కెసి వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ఇదిలాఉండగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియంపై పార్టీ పోలింగ్ బూత్ ఏజెంట్లు (బిఎల్‌ఏ) ఇచ్చిన నివేదికపై అంతగా సంతృప్తి కలిగించలేదని మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. ‘సర్’పై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏఐసిసి పెద్దలు చెప్పారని ఆయన తెలిపారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాలు పని తీరును మెచ్చుకున్నట్లు ఆయన చెప్పారు.











