
హైదరాబాద్: విద్యలో నాణ్యత పెరగాలని, ప్రపంచంతో మనపిల్లలు పోటీ పడాలని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్య అందింది, ఆకలి తీరింది.. కానీ ప్రపంచంతో పోటీ పడటానికి ఇది సరిపోదని అన్నారు. ఫిన్లాండ్, జర్మనీ టీచర్ ఎక్సైంజ్ కార్యక్రమానికి సిఎం, ఉపాధ్యాయులు సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రెసిడెన్సియల్ స్కూల్స్ ఎప్పుడు ప్రారంభమయ్యయో అధ్యయనం చేయండని సూచించారు. ప్రభుత్వాలు సాధారణంగా ఓటుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాయని, ఏ ప్రభుత్వంలో నియామకాలు జరిగాయి? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక కూడా రాజకీయాలు చేయద్దని తమ ఆలోచన అని కోరారు. వెనుకబాటు తనానికి ఆస్తికి సంబంధం లేదని, కానీ పిల్లలను చదివించుకోలేక కొంత ఇబ్బందిపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదాయం పెంచాలి, ప్రజలకు పంచాలి.. అదే తమ ఆలోచన అని బడ్జెట్ లో విద్యకు 9 శాతం ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు. ఒక్కో విద్యార్థిపై రూ. లక్షా8 వేలు ఖర్చు చేస్తున్నామని, ఆస్తి ఉన్నా, చదువుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్లు ఉన్నారని, యాదవ, కురుమ సోదరులకు ఆస్తి ఉంటుందని రేవంత్ పేర్కొన్నారు. మంచిగా పని చేసినందుకు తాను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. తెలంగాణకు పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రి లేరని కొందరు అంటున్నారని, తాను ఇంత కమిట్మెంట్ తో పని చేసినందుకు విద్యశాఖ నుంచి తప్పుకోవాలా? అని టీచర్లకు వివాదం లేకుండా ప్రయోషన్లు ఇచ్చినందుకు తొలగాలా? అని ఐటిఐలను ఎటిసిలుగా మార్చినందుకు తప్పుకోవాలా? అని ప్రశ్నించారు.
అర్జెంటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని అడుగుతున్నారని, లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ మాత్రమేనని అన్నారు. అమెరికాలో అడుక్కునేవాడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడని, చైనా, జర్మనీలో ఇంగ్లీష్ వచ్చినవాళ్లు 10 శాతం కూడా ఉండరని అన్నారు. కానీ వాళ్లు ప్రపంచాన్ని ఎలా శాసిస్తున్నారని ప్రశ్నించారు. అమెరికాపై తగ్గించి..జర్మనీ, జపాన్ లపై ఫోకస్ పెట్టండని ఉపాధ్యాయ సంఘాలకు తన విజ్ఞప్తి చేశారు. తమ సమస్యను పరిష్కరించే బాద్యత తనదని, తనకు వదిలేయండి..ప్రమోషన్స్, ట్రాన్స్ ఫర్స్ ఉపాధ్యాయుల ఇంటికే వస్తాయని, ప్రభుత్వ స్కూల్లో చదివి ఏం అవుతావని అడిగితే సిఎం అవుతానని చెప్పండని సూచించారు. తాను కాలేదా? తనకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేదని, తమ సమస్యను పరిష్కరించే బాద్యత తనదని, ఐదేళ్లు ఫోకస్ చేయండి, పిల్లల సమస్యలపై తనతో కొట్లాడండని అన్నారు. తమరు అనుమానపడొద్దు, 2034 వరకు తానే సిఎం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.











