
హైదరాబాద్: తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకం పార్టీలో అంతర్గత తగాదాలకు దారితీసింది. స్థానిక ఎంఎల్‌ఎ మందుల సామేల్ వర్సెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, పాత కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో రెండు వర్గాల కాంగ్రెస్ నేతల కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. తుంగతుర్తి ఇష్యూ పరిశీలికుడిగా జగ్గారెడ్డిని పార్టీ నియమించింది. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన విభేదాలపై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. తుంగతుర్తి ఎంఎల్‌ఎ మందుల సామేల్, భువనగిరి ఎంపి కిరణ్ కుమార్ రెడ్డితో వేర్వేరుగా భేటీ అయ్యానని తెలిపారు. ఇదంతా తాను చూడని రాజకీయం కాదు అని, ఎవరి కెపాసిటీ ఎంటో తనకు తెలుసునన్నారు. మొదటి ప్రాధాన్యత స్థానిక ఎంఎల్‌ఎకు ఉంటుందని, రెండో ప్రాధాన్యత ఎంపి, మూడో ప్రాధాన్యత డిసిపి ప్రెసిడెంట్‌కు ఉంటుందని తెలియజేశారు. ఒక వర్గానికి సానుకూలంగా మరో వర్గానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వడంలేదని స్పష్టం చేశారు. తాను ఇచ్చిన రిపోర్టుపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. ఈ వివాదంపై ఏడు పేజీల నివేదికను సిద్ధం చేశానట్టు సమాచారం. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్‌లో మహేష్ కుమార్ గౌడ్‌తో జగ్గారెడ్డి సమావేశం కానున్నారు. ఈ నివేదికను సిపిపి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు సమర్పించనున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంపై కోమటి రెడ్డి బ్రదర్స్ పెత్తనం ఏంటని మందుల సామేల్ తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ఎంఎల్ఎ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చిన విషయం విధితమే. మందుల సామేల్ కు తానే ఎంఎల్ఎ టికెట్ ఇప్పించడంతో పాటు గెలిపించానన్నారు.











