
అంతర్రాష్ట్ర నదీజలాలపై చర్చ
రాష్ట్ర బిజెపి ఎంపీలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ హామీ
కాళేశ్వరం నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సాంకేతిక పరిశీలన
జరపాలని మంత్రిని కోరిన ప్రజాప్రతినిధులు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు మరోసారి భేటీ కాబోతున్నట్లు సమాచారం. గురువారం ఢిల్లీలో తనను కలుసుకున్న బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈమేరకు హామీ ఇచ్చినట్లు సమాచా రం. గోదావరి -కావేరి అనుసంధానం, బనకచర్ల, పాలమూరు ప్రా జెక్టులపై చర్చించేందుకు త్వరలో భాగస్వామ్య రాష్ట్రాలతో సమావేశమై ఈ అంశాలను కొలిక్కి తేవాలాని కేంద్రం కృతనిశ్చయంతో ఉన్నట్లు మంత్రి వివరించినట్లు తెలిసింది. త్వరలో మరోసారి రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, డికె శివకుమార్‌లతో భేటీ అయిన తర్వాత చాలా అంశాలు పరిష్కారమవుతాయని చెప్పినట్లు సమాచారం.
కాగా రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రస్తుత నిర్వహణ సాధ్యసాధ్యాలపై సమగ్ర సాంకేతిక పరిశీలన జరపాలని వారు పాటిల్‌ను కోరారు. అలాగే దీని భవిష్యత్తు నిర్వహణకు సంబంధించి స్పష్టమైన సిఫార్సులు చేయాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో రాష్ట్ర బీజేపీ ఎంపీలు గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులు, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గుగనుల శాఖమం త్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, గోడెం నగేశ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌నినో పరిస్థితులు, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా వారు ప్రధానంగా రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితు లు, తదితర కీలక అంశాలపై పాటిల్‌తో కూలంకషంగా చర్చించారు. రైతుల శ్రేయస్సు, రాష్ట్ర సాగునీటి సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం మద్దతుతో తమవంతు కృషిచేస్తామని ఎంపిలు వెల్లడించారు. ఈ సందర్భంగా పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్రమంత్రికి అందజేశారు. అలాగే రాష్ట్రంలో సాగు, తాగు, థర్మల్ పవర్ ప్లాంట్లకు నీరు అందడం లేదని వారు వివరించారు. సమ్మక్క సాగర్ నుంచి గోదావరి, కావేరి అనుసంధానం చేపట్టడానికి కేంద్రం ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో కేంద్రమంత్రితో ఎంపిల భేటీ ఆసక్తికరంగా మారింది.











