మన తెలంగాణ/కొండమల్లేపల్లి: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కెజిబివిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆదిరాల వైష్ణవి, భూషపాక భాను ఉపాధ్యాయులు వేధింపులతో మనస్తాపానికి గురై.. రసాయనం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంగ్ల్లిష్ మీడియం బోధన అర్థ్ధం కాక అధ్యాపకుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడంతో అందరిముందు అవమానించారని తెలిపారు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చినందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట నిలబెట్టారని వాపోయారు. ఇతర విద్యార్థుల ముందు పరుష పదజాలంతో దూషించారని, ఈ అవమానాన్ని భరించలేక మంగళవారం పాఠశాల ఆవరణలోని హెయిర్ కేర్ రసాయనం తాగినట్లుగా వివరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.