
రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్ర రైతాంగం అరిగోస పడుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుండగా, ప్రభుత్వం 70 లక్షల టన్నుల వడ్లను మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం వల్ల మిగతా ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపడం మానేసి, రైతుల ప్రయోజనాల కోసం పోరాడాలని ప్రభుత్వానికి సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు బస్తాకు 43 కిలోలు పెడితేనే ధాన్యం దించుకుంటామని రైతులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, దీనివల్ల ఎకరాకు సుమారు 150 కిలోల వరకు నష్టం వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నంగనూరు, ఖానాపూర్, వెంకటాపూర్, మిట్టపల్లి, ఎన్సాన్ పల్లి తదితర గ్రామాల నుంచి రైతులు ఫోన్లు చేసి తమ సమస్యలు చెప్తున్నారని పేర్కొన్నారు.
వడ్లు కల్లాల్లోనే ఉండిపోవడంతో వానలకు వడ్లు తడిసిపోతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలువురు రైతులు కల్లాల్లోనే ప్రాణాలు కోల్పోయారని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మిషన్ మోడ్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని, కానీ, అసలు పని మాత్రం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రైతుబంధు విషయంలో కూడా ప్రభుత్వం మాట తప్పిందని, రెండు ఎకరాల రైతులకు తప్ప మిగతా వారికి పూర్తిస్థాయిలో నిధులు అందలేదన్నారు. మక్కలు, సన్‌ఫ్లవర్, జొన్నలు అమ్మిన రైతులకు ఇప్పటికీ డబ్బులు జమ కాలేదని తెలిపారు. వెంటనే వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచి, లారీలు, గన్నీబ్యాగులు పంపించి, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే వేలమంది రైతులతో కలిసి కలెక్టరేట్‌ను దిగ్బంధం చేస్తూ నిరవధిక ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, మాజీ ఎంపీపీ అల్లం ఎల్లం, స్థానిక సర్పంచ్ నాగుల స్రవంతి ప్రశాంత్, మాజీ సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, రైతులు, తదితరులు పాల్గొన్నారు.











