మన తెలంగాణ/ మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. క్షణికావేశంలో కట్టుకున్న భార్యను గొంతు నులిమి చంపిన భర్త, తాను ధరించిన లుంగీతో ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తల్లిదండ్రుల మృతితో వారి దత్తపుత్రుడు అనాథగా మారాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్యాల మండలం నూకపెల్లి గ్రామానికి చెందిన ఓలపు నాగరాజు, లక్ష్మి దంపతులకు సంతానం లేకపోవడంతో మూడేళ్ల క్రితం ఓ బాబును దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు.

అయితే, గత కొంతకాలంగా మద్యానికి బానిసైన నాగరాజు తరచూ భార్యతో గొడవ పడుతూ ఇబ్బందులకు గురిచేసేవాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చిన నాగరాజు భార్యతో గొడవపడ్డాడు. ఆవేశంలో భార్య మెడకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేయడంతో లక్ష్మి ప్రాణాలు విడిచింది. భార్యను హతమార్చిన నాగరాజు తాను ధరించిన లుంగీతో ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 25 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసిన దంపతులు ఒకే రోజు శవాలుగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.