రాబోవు నెలల్లోను ఎల్‌నినో ప్రభావం

ప్రస్తుత వర్షాలను చూసి నాట్లు వేయకండి

వరి సాగుపై రైతులు పునరాలోచించుకోవాలి

23 జిల్లాల్లో లోటు వర్షపాతం

ఎల్‌నినోపై జిల్లాల సూచనలతో సిఎంకు సమగ్ర ప్రణాళిక

సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల

మన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే నెలల్లోనూ ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుందని, దీంతో రైతులు వరి సాగుపై పునరాలోచించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను కోరారు. గురువారం సచివాలయంలో జిల్లాల వారీగా వచ్చిన సూచనలు, ప్రస్తుత ఎల్-నినో పరిస్థితులు, రానున్న నెలల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాల వారీగా వచ్చిన సూచనలతో సమగ్ర ప్రణాళిక సిద్దం చేసి సిఎంకు అందచేస్తామన్నారు. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం వచ్చే నెలలో కూడా ఎల్-నినో పరిస్థితులు కొనసాగనున్నాయని, సెప్టెంబర్ నాటికి దాని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, డిసెంబర్ నాటికి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్‌పై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఎగువ రాష్ట్రాల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాకపోవడంతో అక్కడి నుంచి గోదావరి, కృష్ణా నదులకు పెద్దఎత్తున వరదలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని, ఒకటి రెండు జిల్లాలు మినహా ఎక్కడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదని తెలిపారు. గత రెండు రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న వర్షాలను చూసి రైతులు వరి సాగు చేయాలని నిర్ణయించుకోవద్దని స్పష్టం చేశారు. భూగర్భ జలాలు కూడా వేగంగా తగ్గిపోతున్నాయని, బోరుబావుల కింద కూడా వరి సాగు చేయవద్దని రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఉన్న నీరు ప్రధానంగా తాగునీటి అవసరాలకే సరిపోయే పరిస్థితి ఉందని, ప్రతి జిల్లాలోని ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వ సామర్థ్యంపై మండలాల వారీగా రైతులకు నిరంతరం సమాచారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొంతమంది రైతులు ఇంకా వర్షాలు పడతాయనే ఆశతో వరి సాగు చేయాలని భావిస్తున్నారని, వారికి వాస్తవ పరిస్థితులను పూర్తిగా వివరించి ఎలాంటి నష్టాలు జరగకుండా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

గత వర్షాకాలంతో పోలిస్తే ఈ సీజన్‌లో దాదాపు 23 శాతం మేర సాగు విస్తీర్ణం తగ్గే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన విధంగానే ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి కూడా ప్రత్యేక అధికారులను నియమించే అంశంపై కలెక్టర్లతో చర్చించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌కు మంత్రి సూచించారు. ఈ అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామ స్థాయిలో రైతులందరికీ ఎల్-నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలు, నీటి లభ్యత, ప్రభుత్వ సూచనలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.

వ్యవసాయ రంగాలకు బ్యాంకులు రుణ కేటాయింపులు పెంచాలి

ఈ సంవత్సరం 58 వేల కోట్ల రుణాన్ని లక్ష్యంగా పెట్టుకొని, ఇప్పటి వరకు 20 వేల కోట్లు రైతులకు రుణాలుగా అందించామని బ్యాంకు అధికారులు తెలిపగా, రైతులకు ఇచ్చే పంట రుణాలను పెంచాలని బ్యాంకులకు మంత్రి సూచించారు. మైక్రో ఇరిగేషన్ కింద రైతులకు మరింత రుణ సహాయం అందించాలని నాబార్డును కోరారు. ఆర్‌ఐడిఎఫ్ కింద నాబార్డు అందించే రూ. 498 కోట్లను తెచ్చుకునేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కి అందించాలని ఉద్యానశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో రైతులకు అవసరమైన డ్రిప్, స్ప్రింక్లర్లను సబ్సిడీపై అందించే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు అందించే రుణాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

డ్రిప్ పరికరాలు, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు ముందుగానే సిద్ధంగా ఉంచాలని, రైతు వేదికలను విత్తనాల పంపిణీ కేంద్రాలుగా వినియోగించాలని సూచించారు. అవసరమైతే నేషనల్ సీడ్ కార్పొరేషన్ నుంచి విత్తనాలు తెప్పించాలని, ఆ సంస్థ విత్తనాలపై 50 శాతం వరకు సబ్సిడీ అందించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, నిపుణుల కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి కె. సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి, సహకార శాఖ కమిషనర్ రాహుల్ రాజ్, హార్టికల్చర్ ఎండి యాస్మిన్ బాషా, టిజిఎన్‌పిడిసిఎల్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.