
లక్నో: సోషల్ మీడియాలో ఓ యువతిని ఎస్‌ఐ పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడు. అతడిపై ఫిర్యాదు చేయడంతో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమె ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో పాటు విడాకులు తీసుకుంటానని బెదిరించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సత్యేంద్ర గౌతమ్ అనే ఎస్‌ఐ కాన్పూర్‌లోని సేన్ పాశ్చిమ్ పారా ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బిటెక్ చదివిన ఓ యువతి 2024లో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కావడంతో ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని రూమ్‌కు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకోనని చెప్పడంతో సదరు ఎస్‌ఐపై పిఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఆమె శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు విడాకులు ఇస్తానని బెదిరించడంతోపాటు ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో యువతి మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. అత్యాచారం కేసు నుంచి తప్పించుకోవడానికి ఎస్‌ఐ తనని మళ్లీ చేసుకున్నాడని, ఇప్పుడు తనపై దాడి చేయడంతో పాటు ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.











