ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కొత్త కమిటీని కూటమి ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పడిన ఈ కమిటీలో చైర్మన్‌గా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పి. భరత్ భూషణ్‌ను, వైస్ చైర్మన్‌గా ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిటీలో సీనియర్ నటుడు సుమన్ తల్వార్, హీరో శివాజీ , నటి ఝాన్సీతో పాటు దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి, వి.సముద్ర, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, కూచిభోట్ల వివేకానంద, రచయిత బుర్రా సాయి మాధవ్‌లను డైరెక్టర్లుగా నియమించారు.

అలాగే రచయిత డా. కందిమళ్ల సాంబశివరావు, సీనియర్ జర్నలిస్ట్ ఉమా మహేశ్వరరావు సహా పలువురికి కూడా కమిటీలో చోటు కల్పించారు. ఇకపై నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు, సినిమా-టీవీ రంగాలకు సంబంధించిన ప్రోత్సాహక కార్యక్రమాలు ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా, టీవీ షూటింగ్‌లకు ప్రోత్సాహం అందిస్తూ, సినీ మరియు రంగస్థల కళాకారుల అభివృద్ధికి కృషి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.