మెగాస్టార్ చిరంజీవి–యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న రెండో సినిమా గురువారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. వర్కింగ్ టైటిల్ మెగా 158గా రూపొందనున్న ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాగబాబు, దర్శకులు వి.వి. వినాయక్, వశిష్ట, కోన వెంకట్, అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్స్ వర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు విచ్చేయటంతో వేదిక మరింత వైభవంగా మారింది. మెగా త్రయం ఒకే వేదికపై కనిపించడం అభిమానులకు కనులవిందుగా నిలిచింది. పవన్ కళ్యాణ్ క్లాప్‌బోర్డ్ కొట్టగా, సుష్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వి.వి. వినాయక్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. బి. గోపాల్, కోదండరామి రెడ్డి, నాగబాబు చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు కూడా హాజరయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి లోహిత్ తన బృందంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను బాబీ కొల్లి తెరకెక్కించనున్నారు. నటీనటులు సహా ఇతర వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇక ఇప్పటికే చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేర్ వీరయ్య సంచలనాత్మక మాస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ మరోసారి కలవడంతో మెగా 158పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.





















