టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కుతున్న పెద్దిపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను చిత్రయూనిట్ వినూత్నంగా నిర్వహిస్తోంది.

తాజాగా రామ్ చరణ్, బుచ్చిబాబు కలిసి కార్ డ్రైవ్ చేస్తూ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా సినిమాలో తనకు అత్యంత ఇష్టమైన భాగం “ఢిల్లీ ఎపిసోడ్” అని చరణ్ తెలిపారు. కథలో వచ్చే మలుపులు ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తాయని చెప్పారు. ఉప్పెన క్లైమాక్స్ ట్విస్టుతో పోల్చుతూ.. “అందులో ఉన్న ట్విస్ట్ కంటే 100 రెట్లు ఎక్కువ షాకింగ్‌గా ఉంటుంది” అని అన్నారు. దీంతో పెద్ది సినిమాలో భారీ ట్విస్టులు, మాస్ ఎమోషన్స్ ఉండబోతున్నాయనే అంచనాలు మరింత పెరిగాయి.