హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. “ఎస్వీ కృష్ణారెడ్డి గారు లేకపోతే నేను దర్శకుడిని అయ్యేవాడిని కాదు” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లో డ్యామ్ ఎత్తేయడంతో తమ కుటుంబానికి చెందిన పంటపొలం మొత్తం నీటమునిగిపోయిందని తెలిపారు.
ఆ సమయంలో ఎస్వీ కృష్ణారెడ్డి తనకు రూ.25 వేల సాయం చేశారని.. ఆ డబ్బుతో తన తండ్రి మళ్లీ పొలం బాగు చేయించారని చెప్పారు. ఇప్పుడు అదే 9 ఎకరాల పొలం విలువ రూ.5 కోట్లకు చేరిందని తెలిపారు. జీవితాంతం ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డికి రుణపడి ఉంటానని అన్నారు.
చాలా ఏళ్ల తర్వాత శ్రీకాంత్, లయ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ గోవిందుడి పాత్రలో కనిపించనున్నారు. మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలు, కష్టాలు, వినోదాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని రూపొందించారు.














