బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి తన కొత్త నెట్‌ఫ్లిక్స్ చిత్రం మా బెహన్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. మహిళలను, ముఖ్యంగా తల్లులను సమాజం ఎలా ఒక పాత్రలో బంధిస్తుందో ఆమె వివరించారు. చిన్నప్పుడు తన తల్లి అనారోగ్యంతో వంట చేయలేకపోతే తాము ఫిర్యాదు చేసేవాళ్లమని, కానీ ఇప్పుడు ఆమె ఎదుర్కొన్న కష్టాలు తెలుసుకుని కన్నీళ్లు వస్తున్నాయని త్రిప్తి చెప్పారు.

“మనం అమ్మలను కేవలం బాధ్యతల కోసం మాత్రమే చూస్తాం. వాళ్లలోని మనిషిని గుర్తించం,” అని ఆమె అన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, తమ కాలనీలో ఒంటరిగా ఉండే ఇద్దరు ఫ్యాషన్ మహిళలను సమాజం తప్పుగా చూసేదని తెలిపారు. “వాళ్లతో కలవొద్దని చెప్పేవారు. ఇప్పుడు ఆలోచిస్తే వాళ్లను కారణం లేకుండా జడ్జ్ చేశామనిపిస్తుంది,” అని చెప్పారు.

దర్శకుడు సురేష్ త్రివేణి తెరకెక్కించిన ఈ చిత్రంలో మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రి, ధర్ణా దుర్గా, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.