న్యూజెర్సీలోని పిస్కటవేలో గణేశ్ చతుర్థి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. Villas at Fairways వేదికగా సెప్టెంబర్ 14 నుంచి 19 వరకు ప్రత్యేక పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ప్రదర్శనలు నిర్వహించారు.
“ఓం శ్రీ గణేశాయ నమః” నామస్మరణతో ప్రారంభమైన వేడుకల్లో తొలి రోజు గణేశ స్థాపన పూజను ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులందరూ కలిసి పొట్లక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక హారతులు, ప్రసాద వితరణ కొనసాగాయి.
చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, భజనలు తదితర కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు.
$9,000కు లడ్డూ వేలం!
వేడుకల చివరి రోజైన సెప్టెంబర్ 19న ప్రత్యేక పూజలు, పొట్లక్ కార్యక్రమాల అనంతరం నిర్వహించిన లడ్డూ వేలంలో భారీ స్పందన లభించింది. గణపతి లడ్డూ $9,000కు వేలం కావడం వేడుకల్లో హైలైట్‌గా నిలిచింది.
లడ్డూ వేలం అనంతరం గణేశ నిమజ్జనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆధ్యాత్మికత, సంప్రదాయం, సాంస్కృతిక కార్యక్రమాలతో సాగిన ఈ గణేశ్ చతుర్థి వేడుకలు భక్తుల్లో ఆనందోత్సాహాలను నింపాయి.













