అమెరికాలోని అట్లాంటా నగరంలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం జూన్ 5, 2026న ఘనంగా జరిగింది. ఫ్యూజన్ అండ్ గ్రిల్ వేదికగా నిర్వహించిన ఈ సమావేశానికి అట్లాంటాలోని వివిధ తెలుగు, సామాజిక సంస్థల అధ్యక్షులు, కమ్యూనిటీ నాయకులు, కోర్ టీమ్ సభ్యులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు పరస్పర పరిచయాలు పెంపొందించుకోవడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణ, కమ్యూనిటీ సేవా కార్యక్రమాలు, తెలుగు సంస్కృతి పరిరక్షణ, యువత భాగస్వామ్యం మరియు సమాజ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. తెలుగు సమాజాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, స్థానిక సమాజానికి కూడా సేవలందించేలా ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరాన్ని వారు ప్రస్తావించారు.
వివిధ సంస్థల నాయకులు ఒకే వేదికపై కలుసుకొని ఐక్యత, సహకారం, సేవా భావంతో ముందుకు సాగాలని సంకల్పించడం ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్నేహపూర్వక వాతావరణంలో సాగిన ఈ సమావేశం అందరినీ ఆకట్టుకుంది.
కార్యక్రమ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ AAA అట్లాంటా చాప్టర్ అధ్యక్షురాలు కోమలి ఔరా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన నాయకులు, సభ్యులు, వాలంటీర్లు, అతిథులు అందించిన సూచనలు, ప్రోత్సాహం సంస్థ భవిష్యత్ కార్యక్రమాలకు దిశానిర్దేశం చేస్తాయని ఆమె పేర్కొన్నారు.
అలాగే, వేదిక, ఆతిథ్యం, రుచికరమైన విందుతో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఫ్యూజన్ అండ్ గ్రిల్ యాజమాన్యానికి, ముఖ్యంగా అనిల్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలోని మధుర క్షణాలను చిత్రీకరించిన రేణుక మొల్లేటి , ముద్రా సైన్స్ అండ్ స్టూడియోస్ బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.
సమాజ సేవ, ఐక్యత, పరస్పర సహకారమే సంస్థ విజయానికి మూలస్తంభాలని పేర్కొన్న కోమలి ఔరా, భవిష్యత్‌లో కూడా ఇదే ఉత్సాహంతో కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో పాల్గొని సంస్థకు అండగా నిలవాలని సభ్యులకు పిలుపునిచ్చారు. ఇలాంటి సమావేశాలు అట్లాంటా ప్రాంతంలోని తెలుగు సమాజాన్ని మరింత దగ్గర చేసి, భవిష్యత్ తరాలకు సానుకూల మార్గదర్శకంగా నిలుస్తాయని నాయకులు అభిప్రాయపడ్డారు.
























