అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు టెక్సాస్‌లోని ఇర్వింగ్ నగరంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు, స్థానిక ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఇర్వింగ్ మేయర్ యాల్ జపంటా, నగర అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్రను ప్రశంసిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గాంధీ స్మారకాన్ని ఇర్వింగ్‌లో ఏర్పాటు చేయడం గర్వకారణమని పేర్కొంటూ అందరికీ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రత్యేక అతిథిగా పాల్గొన్న టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి మ్యాట్ షాహీన్, దశాబ్దాలుగా టెక్సాస్‌లో స్థిరపడిన భారతీయులు టెక్నాలజీ, విద్య, వైద్యం వంటి రంగాల్లో విశేష సేవలందిస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు అమెరికా జీడీపీ వృద్ధికి కూడా తోడ్పడుతున్నారని కొనియాడారు.
కార్యక్రమంలో స్వర స్వాతి సింగింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో 50 మందికి పైగా చిన్నారులు అమెరికా జాతీయగీతంతో పాటు పలు దేశభక్తి గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. యువతే దేశ భవిష్యత్తని పేర్కొంటూ అతిథులు చిన్నారులను అభినందించారు.
మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ, అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తవడం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలకు అమెరికా అందించిన అవకాశాలు దేశాన్ని మరింత బలపరిచాయని, భారతీయ అమెరికన్లు విద్య, వైద్యం, శాస్త్రసాంకేతికం, వ్యాపారం వంటి అన్ని రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతి, విలువలను కాపాడుకుంటూనే అమెరికా సమాజంలో భాగస్వాములుగా ముందుకు సాగాలని, స్వేచ్ఛతో పాటు బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ద్వేషం కంటే ప్రేమ, విభేదాల కంటే ఐక్యత, స్వార్థం కంటే సేవాభావాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు, వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన స్వర స్వాతి సింగింగ్ గ్రూప్ అధినేత స్వాతి కుప్పిలి, చిన్నారుల తల్లిదండ్రులు, వాలంటీర్లు, అతిథులకు నిర్వాహకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.






















