అమెరికాలోని డాలస్ నగరంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అమెరికా దేశంలోనే అతిపెద్ద మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో400 మందికి పైగా ప్రవాస భారతీయులు పాల్గొని విజయవంతం చేశారు. యోగా, ధ్యానం, ఆరోగ్య చైతన్యం, భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబించిన ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కార్యక్రమానికి స్వాగతం పలికిన మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల మాట్లాడుతూ, మహాత్మాగాంధీ నిత్యం యోగా, ధ్యానం చేసేవారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుడి విగ్రహం సాక్షిగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన భారత కాన్సుల్ జనరల్ డి.సి. మంజునాథ్ మాట్లాడుతూ, 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఐక్యరాజ్యసమితిలో 175 దేశాలు మద్దతు తెలిపాయని గుర్తుచేశారు. 2015 నుంచి ప్రతి ఏడాది జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను ఆచరిస్తూ భారతీయ ఆధ్యాత్మిక సంపదను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని తెలిపారు. పతంజలి మహర్షి అందించిన యోగసూత్రాలు ప్రపంచానికి భారతదేశం అందించిన అపూర్వమైన బహుమతిగా అభివర్ణించారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ, యోగా అంటే శరీరం, మనస్సు, ఆత్మల మధ్య ఐక్యత అని వివరించారు. యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, శ్వాస నియంత్రణ మెరుగుపడటమే కాకుండా ఒత్తిడి, ఆందోళనలను కూడా తగ్గించుకోవచ్చని చెప్పారు. ఆరోగ్యకరమైన కుటుంబాలు, బలమైన సమాజం, శాంతియుత ప్రపంచ నిర్మాణానికి యోగా మార్గదర్శిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కేవలం ఒక రోజు వేడుకగా కాకుండా, యోగాను జీవితంలో భాగం చేసుకోవాలనే సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ కో-ఛైర్మన్ మహేంద్ర రావు మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలుగా ఇదే ప్రాంగణంలో నిరంతరంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది పాల్గొనేవారి సంఖ్య పెరుగుతుండటం యోగాపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనమని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

‘హార్ట్ ఫుల్నెస్’ సంస్థ సహకారంతో సురేఖ కోయా బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా, ధ్యాన శిక్షణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో గంటన్నరపాటు సాగిన ఈ శిక్షణలో పాల్గొన్నవారు ఉత్సాహంగా యోగా సాధన చేసి మానసిక ప్రశాంతతను ఆస్వాదించారు.

కార్యక్రమం ముగింపులో మహాత్మాగాంధీ మెమోరియల్ కో-ఛైర్మన్ తైయబ్ కుండావాల, వేడుకలను విజయవంతం చేసిన స్వచ్ఛంద సేవకులు, అతిథులు, పాల్గొన్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు దీపక్ కల్రా, మురళి వెన్నం, తైయబ్ కుండావాల, కళ కృష్ణమూర్తి, హరీష్ నేహతే, అనంత్ మల్లవరపు, వినోద్ ఉప్పుతో పాటు పలు భారతీయ సంఘాల ప్రతినిధులు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

"యోగాతో ఆరోగ్యం – ధ్యానంతో ప్రశాంతత" అనే సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఈ వేడుకలు డాలస్‌లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని మరోసారి ప్రతిబింబించాయి.