అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలో గ్లోబల్ తెలంగాణ సంఘం (GTA) బోర్డు సమావేశం జరిగింది. సంస్థ కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు విస్తరించడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు జీటీఏ వ్యవస్థాపక ఛైర్మన్ కలవాల విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.
2023లో స్థాపించిన గ్లోబల్ తెలంగాణ సంఘానికి ప్రస్తుతం 54 దేశాల్లో శాఖలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జన్మభూమి, కర్మభూమి మధ్య వారధిగా జీటీఏను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రవాసులు ఎక్కడ ఉన్నా అక్కడ జీటీఏ విభాగాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ బోర్డు సమావేశానికి ఫ్రిస్కో నగర మేయర్ మార్క్ హిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్న జీటీఏ కార్యక్రమాలను ఆయన అభినందించారు.
అనంతరం సాయంకాలం నిర్వహించిన కార్యక్రమంలో జీటీఏ డాలస్ విభాగం నాయకత్వాన్ని ప్రకటించారు. స్థానిక తెలంగాణ ప్రవాసులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో జీటీఏ ఛైర్మన్ కేశిరెడ్డి ప్రవీణ్, అధ్యక్షుడు కేతిరెడ్డి బాపురెడ్డి, ఉపాధ్యక్షులు ప్రవీణ్ బిల్లా, మధు, ప్రవీణ్‌కుమార్, తదుపరి అధ్యక్షుడు రవీందర్ గడ్డంపల్లి, ఈసీ సభ్యులు దుషంత్ రెడ్డి, హరి, సుధీర్, వంశీతో పాటు BOT సభ్యులు అమర్, అరుణ్, బిందు, కోట్య, కృష్ణ, మహేష్, మన్మోహన్, మోహన్, నరసింహారెడ్డి, ప్రవీణ్, ప్రేమ్, రఘు, రాజేందర్, సుమ, సురేందర్, సుశాంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
డాలస్ నుంచి సందీప్ జంబుల, సంతోష్ చెరుకు, కిరణ్ నాయక్ తదితరులు హాజరయ్యారు.






















