అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రవాసులతో పాటు దక్షిణాసియా కమ్యూనిటీకి చట్టపరమైన అవగాహన కల్పించే దిశగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నెలా ఆన్‌లైన్‌లో నిర్వహించే మంత్లీ లీగల్ సెమినార్ సిరీస్ను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ సెమినార్లు జూలై 25, 2026 నుంచి ప్రారంభమై ప్రతి నెల చివరి శనివారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు (EST) జూమ్ వేదికగా నిర్వహించనున్నారు. ఏడాది చివరి వరకు ఆగస్టు 29, సెప్టెంబర్ 26, అక్టోబర్ 31, నవంబర్ 28, డిసెంబర్ 19 తేదీల్లో వరుసగా కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

ప్రవాసులు ఎక్కువగా ఎదుర్కొనే ఇమ్మిగ్రేషన్, ఫ్యామిలీ లా, రియల్ ఎస్టేట్, బిజినెస్ లా అంశాలపై నిపుణులు సమగ్రంగా అవగాహన కల్పించనున్నారు. వీసా నిబంధనలు, గ్రీన్ కార్డ్ ప్రక్రియ, కుటుంబ చట్టాలు, ఆస్తుల కొనుగోలు-అమ్మకాలు, వ్యాపార నిర్వహణలో పాటించాల్సిన చట్టపరమైన అంశాలపై తాజా సమాచారం అందించనున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయ నిపుణులు సంతోష్ ఆర్. సోమిరెడ్డి, భాను బి. ఇలింద్ర, ప్రేమా రొడ్డం, మధురిమ పాటూరి పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు. ప్రతి సెషన్ ముగింపులో పాల్గొనేవారి ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇచ్చే ప్రత్యేక ప్రశ్నోత్తర కార్యక్రమం కూడా ఉంటుంది.

మాటా జాతీయ అధ్యక్షుడు రమణ కె. కిరణ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గుడూరు, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్ కలాల్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల కూడా దీనికి మద్దతు అందిస్తున్నారు.

సెమినార్లలో పాల్గొనాలనుకునే వారు లేదా చట్టపరమైన మార్గదర్శకత్వం కోరుకునే వారు మాటా కమ్యూనిటీ సర్వీసెస్ ప్రతినిధి లక్ష్మీకాంత్ గాజులను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. అమెరికాలోని తెలుగు ప్రవాసులకు నిపుణుల సలహాలు అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మాటా నాయకత్వం వెల్లడించింది.

mata legal.jpg