అమెరికాలోని నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (NATS) టాంపా బే టీమ్ ఆధ్వర్యంలో జూలై 11న "స్ట్రెస్ మేనేజ్‌మెంట్" అంశంపై అవగాహన సదస్సు విజయవంతంగా నిర్వహించారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి శ్రీ రాజేష్ కండ్రు స్వాగతం పలుకుతూ, NATS సంస్థ చేపడుతున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను పరిచయం చేశారు. అనంతరం విక్రమ్ నంద్యాల అతిథి వక్త కె. గోపాలన్ను సభకు పరిచయం చేశారు. వ్యక్తిగత, సంస్థాగత మార్పు నిర్వహణలో నిపుణుడిగా, CHANGE – A Learning Center for Personal and Organizational Change Management వ్యవస్థాపకుడైన కె. గోపాలన్ పాల్గొనడం విశేషంగా నిలిచింది.
తన ప్రసంగంలో కె. గోపాలన్, NATS ఛైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు రాజ్ అల్లాడ, NATS టాంపా బే టీమ్, అలాగే డా. మల్లికార్జున నంద్యాలకు తనను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువత, ఉద్యోగులు, గృహిణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, సవాళ్లపై వారు పంచుకున్న అనుభవాలు కార్యక్రమాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి.
సదస్సులో ఒత్తిడి అంటే ఏమిటి?, అది శారీరకంగా, మానసికంగా ఎలా ప్రభావితం చేస్తుందనే అంశాలను వివరించారు. అలాగే రోజువారీ ఒత్తిడులు, దీర్ఘకాలిక సమస్యలు, అనుకోని పరిస్థితుల వల్ల కలిగే మానసిక ఒత్తిడి గురించి అవగాహన కల్పించారు.
ఒత్తిడిని అధిగమించేందుకు శ్వాస వ్యాయామాలు, సమయ నిర్వహణ, సానుకూల ఆలోచన విధానం, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి పలు సూచనలు చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు తమ రోజువారీ జీవితంలో సులభంగా పాటించగల అలవాట్లను కూడా వివరించారు.
ఇంటరాక్టివ్‌గా సాగిన ఈ సెషన్‌లో పాల్గొన్న వారు తమ ఒత్తిడి పరిస్థితులను గుర్తించి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలపై అవగాహన పెంపొందించుకున్నారు. విద్యార్థులు చదువు, సామాజిక ఒత్తిడులపై స్పందించగా, ఉద్యోగులు కార్యాలయ బాధ్యతల గురించి, గృహిణులు కుటుంబ జీవనంలో భావోద్వేగ సమతుల్యత ప్రాముఖ్యతను చర్చించారు.
ఈ కార్యక్రమంలో NATS టాంపా బే కోర్ టీమ్ సభ్యులు అను కొత్త, శ్రీనివాస్ మల్లాడి (BOD), రాజేష్ కండ్రు (VP – Programs), సుధీర్ మిక్కిలినేని (EC Secretary), రమేష్ కొల్లి, సుమంత్ రామినేని, విజయ్ కట్టా, సురేష్ బొజ్జా, నవీన్ మెడికొండ, అనిల్ అరమాడ, రవి కలిదిండి, సంజయ్ కొండ, శిరీష దొడ్డపనేని పాల్గొన్నారు.
కార్యక్రమ విజయవంతానికి మీడియా ప్రచారంలో సహకరించిన మురళీకృష్ణ మెడిచర్ల (Executive Secretary – Media), కిషోర్ నారే (Executive Secretary – Web), శ్రవణ్ కుమార్ నిడిగంటి (National Coordinator – Media Relations)లకు NATS టాంపా బే టీమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
చివరగా అతిథి వక్త కె. గోపాలన్‌కు ఘన సన్మానం నిర్వహించి, వోటు ఆఫ్ థ్యాంక్స్‌తో పాటు గ్రూప్ ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఈ అవగాహన సదస్సు మానసిక ఆరోగ్యంపై సమాజంలో సానుకూల చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు.





















