న్యూయార్క్ సిటీ మేయర్ జొహ్రాన్ మమ్దానీ క్వీన్స్‌లోని ఫ్లోరల్ పార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో పాల్గొని భారతీయ అమెరికన్లతో కలిసి స్వాతంత్య్ర వేడుకల్లో సందడి చేశారు. భారతీయుల ఉత్సాహం, దేశభక్తి నినాదాలతో పరేడ్‌ ప్రాంతం మార్మోగింది.

ఈ సందర్భంగా మమ్దానీ ఎక్స్‌ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. న్యూయార్క్ నగరానికి తొలి భారతీయ-అమెరికన్ మేయర్‌గా ఇండియా డే పరేడ్‌లో పాల్గొనడం అద్భుతమైన అనుభవమని.. దీన్ని ఎన్నటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు.

మేయర్ డేవిడ్ డింకిన్స్‌ చెప్పిన ‘గార్జియస్ మోసాయిక్’ వ్యాఖ్యను గుర్తుచేస్తూ.. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, జైనులు, బౌద్ధులు, సిక్కులతో కూడిన భారతీయ డయాస్పోరా న్యూయార్క్ నగరాన్ని మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దిందని మమ్దానీ అన్నారు. అందరితో కలిసి ఈ నగర అభివృద్ధికి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.