తెలుగు భాష, సాహిత్య అభిమానులకు అరుదైన అవకాశం లభించనుంది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రం టక్సన్‌లో అష్టావధానం కార్యక్రమం నిర్వహించనున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ టక్సన్, అరిజోనా (TATA) ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ అవధాని బ్రహ్మశ్రీ వడ్డిపర్తి పద్మాకర్ తన ప్రతిభను ప్రదర్శించనున్నారు.

అష్టావధానం అనేది తెలుగు సాహిత్యంలో అత్యంత క్లిష్టమైన, ఆసక్తికరమైన ప్రక్రియల్లో ఒకటి. ఎలాంటి పెన్ను, కాగితం ఉపయోగించకుండా.. ఒకేసారి ఎనిమిది మంది పృచ్ఛకులు అడిగే విభిన్న సాహిత్య ప్రశ్నలు, సవాళ్లకు తక్షణమే సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అపారమైన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, పాండిత్యం, సృజనాత్మకత, చమత్కారం ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి.

బ్రహ్మశ్రీ వడ్డిపర్తి పద్మాకర్ ఇప్పటివరకు 1260కి పైగా అష్టావధానాలు, 28కి పైగా శతావధానాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆయన అద్భుతమైన అవధాన ప్రతిభను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం టక్సన్ తెలుగు సాహిత్యాభిమానులకు దక్కనుంది.

ఈ కార్యక్రమం సెప్టెంబర్ 19, 2026, శనివారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 5:30 గంటల వరకు జరగనుంది. టక్సన్‌లోని University of Arizona Health Sciences Campusలో ఉన్న Iris Cantor Building – Room 160 MPRలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రవేశం పూర్తిగా ఉచితం. తెలుగు భాష, సాహిత్యంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరై అష్టావధానాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

తెలుగు భాషా వైభవాన్ని, మన సాహిత్య సంప్రదాయంలోని అద్భుతమైన మేధోశక్తిని చాటిచెప్పే ఈ అష్టావధాన మహోత్సవం తెలుగు అభిమానులకు మరచిపోలేని అనుభూతిని అందించనుంది.

Ashtavadhanam.jpg