అమెరికాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్ 2026 సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలుగు ప్రవాసులు, కమ్యూనిటీ నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అతిథులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఎం.వి. గోనారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్సార్‌ను ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేతగా అభివర్ణించారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం ఆయన అమలు చేసిన పథకాలు నేటికీ ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
వైఎస్సార్ పాలనలో ప్రజాసేవకు ఇచ్చిన ప్రాధాన్యత, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలను ఆయన గుర్తు చేశారు. నాయకత్వం అంటే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమేనని వైఎస్సార్ నిరూపించారని, ఆయన సేవా భావం, మానవత్వం, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
వేల మైళ్ల దూరంలో ఉన్నా తెలుగు ప్రజలు వైఎస్సార్ జయంతిని ఇంత ఘనంగా నిర్వహించడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని గోనారెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న టీటీఏ నాయకత్వాన్ని ఆయన అభినందిస్తూ, భావితరాలకు వైఎస్సార్ ఆశయాలు, సేవా తత్వం, సమాజ పట్ల బాధ్యతను చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ వేడుకలో పాల్గొన్న వారు వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పిస్తూ, ఆయన చూపిన ప్రజాసేవ, కరుణ, సమగ్ర అభివృద్ధి మార్గాన్ని కొనసాగించాలని సంకల్పించారు. టీటీఏ మెగా కన్వెన్షన్‌లో నిర్వహించిన ఈ జయంతి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ప్రవాస తెలుగు సమాజంలో ఐక్యతను, సేవా స్పూర్తిని మరింత బలోపేతం చేశాయి.
















